దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ యుద్ధక్షేత్రానికి సుమారు 2,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిబియాలోని బెంఘాజీ నౌకాదళ స్థావరంలో రష్యా యుద్ధనౌకను ముంచివేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఆదివారం ఉదయం స్వదేశీ సముద్ర డ్రోన్ల సాయంతో జరిపిన ఈ మెరుపు దాడిని ఆయన ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో ఉక్రెయిన్ దళాలు ఏడు సముద్ర డ్రోన్‌లను ఉపయోగించాయని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దెబ్బతిన్న ‘మెర్కురీ’ యుద్ధనౌక రష్యాకు చెందిన అత్యాధునిక నౌకల్లో ఒకటి. ఇది 2023లో రష్యా నౌకాదళంలో చేరింది. ఈ దాడిలో మెర్కురీ నౌకపై ఉన్న కా-27 సైనిక హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా, రష్యా సైన్యానికి ఆయుధాలు, ఇతర సామగ్రిని తరలిస్తున్న ‘ఎంవీ అంగారా’ కార్గో నౌకపై కూడా దాడి చేసి భారీ నష్టం కలిగించారు. మెర్కురీ నౌక సాధారణంగా ఈ కార్గో నౌకతో పాటు ఇతర రష్యా నౌకలకు రక్షణగా ఉండేదని ఉక్రెయిన్ భద్రతా విభాగం తెలిపింది.
మందుగుండు సామగ్రి పేలడంతో భారీ నష్టం
తూర్పు లిబియా ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం ప్రకారం.. ఇంధనం నింపుకోవడానికి, అవసరమైన సామగ్రి తీసుకోవడానికి ఈ నౌక బెంఘాజీకి వచ్చింది. ఇదే అదనుగా ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడిలో కనీసం రెండు డ్రోన్‌లు యుద్ధనౌకను నేరుగా తాకగా, మరికొన్నింటిని అడ్డుకున్నట్లు లిబియా అధికారులు తెలిపారు. దాడి ధాటికి నౌకలోని మందుగుండు సామగ్రి పేలడంతో భారీ పేలుళ్లు సంభవించి, మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రష్యా, లిబియాకు చెందిన కనీసం 10 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటలకే బెంఘాజీ సమీపంలో వెళ్తున్న మరో వాణిజ్య నౌకపైనా సముద్ర డ్రోన్ దాడి జరిగినట్లు లిబియా కోస్ట్‌గార్డ్ తెలిపింది. ఈ దాడిపై స్పందించడానికి క్రెమ్లిన్ ప్రతినిధి నిరాకరించారు. అవసరమైతే రక్షణ మంత్రిత్వ శాఖ వివరాలు చెబుతుందని అన్నారు. మరోవైపు, పశ్చిమ లిబియాను వేదికగా చేసుకుని ఈ దాడికి ఏర్పాట్లు చేశారన్న ఆరోపణలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని తూర్పు లిబియా ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిని కోరింది.
సముద్ర మార్గాలపై భారత్ అప్రమత్తం
మధ్యధరా సముద్రం, దాని సమీప జలాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సముద్ర మార్గాలు ప్రపంచ వాణిజ్యం, చమురు రవాణా, సరఫరా గొలుసులకు అత్యంత కీలకం. భారత్‌కు కూడా ఈ మార్గాలతో వాణిజ్యపరమైన సంబంధాలు ఉండటంతో కేంద్ర భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే భారతీయ వాణిజ్య నౌకలు, నావికుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. దాడుల ప్రభావం సరుకు రవాణా, ఇంధన సరఫరాపై పడకుండా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్‌లోని డైమర్, జాపోరిజ్జియా, క్రామటోర్స్క్ ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రష్యా దాడులకు స్వదేశీ ఆయుధాలతో దీటుగా బదులిస్తామని ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో యుద్ధం భూభాగాలకే పరిమితం కాకుండా సముద్ర మార్గాలకూ విస్తరిస్తుండటం అంతర్జాతీయ భద్రతకు సవాలుగా మారింది.