Sathya Velugu, 24 నవంబర్ 2026: 500 లీటర్ల ట్యాంకు నుంచి వాయువు లీకేజీ
ఘాటైన వాసనతో భయాందోళనకు గురైన స్థానికులు
రంగంలోకి రెండు ఫైర్ ఇంజన్లు.. కొవ్వూరు నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందం
విస్సన్నపేట, ఆంధ్రప్రభ :
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. గ్రామంలోని పైలెట్ ప్రాజెక్టు వద్ద ఉన్న క్లోరినేషన్ గ్యాస్ ట్యాంకు నుంచి తెల్లవారుజాము నుంచే వాయువు లీకవుతుండటంతో పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసన వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
పైలెట్ ప్రాజెక్టు వద్ద 500 లీటర్ల సామర్థ్యం కలిగిన క్లోరినేషన్ గ్యాస్ ట్యాంకు నుంచి లీకేజీ జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లీకేజీని నియంత్రించేందుకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని భావించిన అధికారులు కొవ్వూరు నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నారు. ఆ బృందం చేరుకున్న అనంతరం లీకేజీ నియంత్రణకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. తెల్లవారుజాము నుంచి గ్యాస్ లీకేజీ కొనసాగుతుండటంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.