Sathya Velugu, 25 నవంబర్ 2026: Mumbai Firing | కారులో వచ్చారు.. కాల్పులు జరిపారు.. వెంటనే పరారయ్యారు!
- ముంబైలో నగల దుకాణంపై తుపాకీ కాల్పులు
- పీసీ జైన్ జ్యువెలర్స్ లక్ష్యంగా 5-6 రౌండ్ల కాల్పులు
- ప్రాణనష్టం లేదని ప్రాథమిక సమాచారం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు
- కాల్పుల వెనుక కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు
Mumbai Firing | ఆంధ్రప్రభ వెబ్, జాతీయ క్రైమ్ ప్రతినిధి : మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని మటుంగా ప్రాంతంలో ఉన్న ప్రముఖ నగల దుకాణం పీసీ జైన్ జ్యువెలర్స్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం (నవంబర్ 25) సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన దుండగులు దుకాణం వద్ద 5 నుంచి 6 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. వరుసగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు.
షోభా హోటల్ సమీపంలో ఘటన
మటుంగా ప్రాంతంలోని షోభా హోటల్ పక్కనే పీసీ జైన్ జ్యువెలర్స్ దుకాణం ఉంది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కాల్పులు జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తుపాకీ శబ్దాలు వినిపించగానే పలువురు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దుకాణదారులు, పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల సమాచారం వెలుగులోకి రాలేదని ప్రాథమిక కథనాలు వెల్లడించాయి.
రంగంలోకి దిగిన పోలీసులు
కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే మాహిమ్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దుండగులు ఏ వాహనంలో వచ్చారు? కాల్పుల అనంతరం ఏ మార్గంలో పారిపోయారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
కాల్పుల వెనుక కారణం ఏమిటి?
పీసీ జైన్ జ్యువెలర్స్నే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యాపారపరమైన వివాదాలు, ఆర్థిక లావాదేవీల గొడవలు లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ అంశాలపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. నిందితుల వివరాలు కూడా వెల్లడికాలేదు.
మహారాష్ట్రలో వరుస కాల్పుల ఘటనలతో ఆందోళన
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాల్పుల ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మటుంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల గుర్తింపు, కాల్పుల వెనుక అసలు ఉద్దేశం తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.