Sathya Velugu, 26 నవంబర్ 2026: రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు..
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై రాళ్ల దాడి
ఎమ్మెల్యే కాన్వాయ్ వాహనం కింద మహిళ..
కాళ్లు విరిగి తీవ్ర గాయాలు
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లావ్యాప్తంగా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగినప్పటికీ, అహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ సమయంలో రిగ్గింగ్ జరుగుతోందన్న ఆరోపణలతో ఇరు వర్గాల వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆమె పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎమ్మెల్యే కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని ఓ వాహనం కింద మహిళ ఇరుక్కుపోవడంతో ఆమె కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షారణ్ ఎమ్మెల్యే అఖిలప్రియతో చర్చించారు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆమెకు సూచించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి పోలీసులే కారణమని ఆరోపించారు. గత వారం రోజులుగా పోలీసు అధికారులకు ఈ విషయంపై చెబుతున్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులను స్వేచ్ఛగా వదిలేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనపై నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.