Sathya Velugu, 26 నవంబర్ 2026: దిశ, వెబ్డెస్క్: దేశంలోని మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామని, దీనిని ప్రతిపక్షాలు ఏమాత్రం అడ్డుకోలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన సవరణలతో పోల్చి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో వ్యక్తుల హక్కులను కాలరాశారు, ఎమర్జెన్సీని విధించారు. కానీ మేము ఇతర వెనుకబడిన తరగతులకు హక్కులు కల్పించాం, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు అందించాం అని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ తదుపరి భారీ లక్ష్యం ‘ఉమ్మడి పౌర స్మృతి’ (యూసీసీ) అని సంకేతాలిస్తూ, బీజేపీ పాలిత ప్రతి రాష్ట్రంలోనూ దీనిని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. దేశంలో యూసీసీ రావాలని రాజ్యాంగ నిర్మాతలే సూచించారని, దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించాలనే ఉద్దేశంతోనే దీనిని తీసుకొస్తున్నట్లు ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నానని అన్నారు.
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక రాజ్యాంగ సవరణలను వివరిస్తూ.. దేశ పన్నుల వ్యవస్థలో ఏకరూపత కోసం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీని తీసుకొచ్చామని అమిత్ షా తెలిపారు. అలాగే, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించామని, 103వ సవరణ ద్వారా అప్పటివరకు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్ కల్పించామని వివరించారు. అనంతరం 106వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో నారీ శక్తి కోసం 33 శాతం రిజర్వేషన్ కల్పించామని, అయితే కాంగ్రెస్ పార్టీ దీనిని అడ్డుకుంటోందని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్లు అందించాలనేది బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పమని, దీనిని ఆపడం రాహుల్ గాంధీ వల్ల కాదని ఆయన సవాల్ విసిరారు.