Sathya Velugu, 27 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రతిపక్ష నేత (LoP) నియామక వివాదంపై కలకత్తా హైకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) రెబల్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీని అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా, అఖ్రుజ్జమాన్‌ను చీఫ్ విప్‌గా గుర్తిస్తూ అసెంబ్లీ స్పీకర్ రథీంద్ర బోస్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. స్పీకర్ నిర్ణయం చట్టబద్ధంగా సమర్థనీయం కాదని స్పష్టం చేసిన జస్టిస్ కృష్ణారావు నేతృత్వంలోని ధర్మాసనం, ఈ అంశాన్ని పునఃపరిశీలించి 10 రోజుల్లోగా సహేతుకమైన కారణాలతో కూడిన తాజా ఉత్తర్వులు (Reasoned Order) జారీ చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో మమతా బెనర్జీకి బిగ్ రిలీఫ్ లభించింది.
టీఎంసీ చీలిక.. వివాదానికి దారితీసిన పరిణామాలు
ఈ ఏడాది మే నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలవడంతో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది. ఈ ఓటమి తర్వాత 1999లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా టీఎంసీలో భారీ చీలిక ఏర్పడింది. మే 6న జరిగిన టీఎంసీ శాసనసభా పక్ష సమావేశంలో సుమారు 70 మంది ఎమ్మెల్యేలు పాల్గొని సీనియర్ నేత శోభన్‌దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానంపై సంతకాలు చేశారు. అయితే, ఆ తీర్మానంపై సంతకాలను ఫోర్జరీ చేశారంటూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రితబ్రత బెనర్జీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్, అప్పటి టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
రెబల్ వర్గానికి గుర్తింపు.. హైకోర్టులో న్యాయపోరాటం
ఆ తర్వాత కొద్ది రోజులకే 59 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి రితబ్రత బెనర్జీ పార్టీ నుంచి విడిపోయి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరిట ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశారు. అసలైన టీఎంసీ తమదేనంటూ రితబ్రత సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ రథీంద్ర బోస్, జూన్ 3న ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించారు. దీనిని సవాలు చేస్తూ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వర్గానికి చెందిన శోభన్‌దేవ్ చటోపాధ్యాయ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
జులైలో డివిజన్ బెంచ్ వీరి నియామకాలను రెండు నెలల పాటు మధ్యంతర ప్రాతిపదికన కొనసాగించేందుకు అనుమతించింది. అయితే అక్టోబర్ 18న ఆ గడువు ముగిసినా, ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేకుండానే వారు ప్రతిపక్ష నేత, చీఫ్ విప్ హోదాలో ప్రభుత్వ ప్రోటోకాల్, సౌకర్యాలను అనుభవిస్తున్నారని చటోపాధ్యాయ మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు, తాజాగా రెబల్ నేతల నియామకాలను కొట్టివేస్తూ స్పీకర్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.