- రూ.2.5 లక్షల విలువైన 120 మీటర్ల కేబుల్స్ స్వాధీనం
- బొలెరో వాహనంలో తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు
Sathya Velugu, 28 నవంబర్ 2026: హైదరాబాద్, ఆంధ్రప్రభ :
బీఎస్ఎన్ఎల్కు చెందిన నిరుపయోగంగా ఉన్న భూగర్భ రాగి కేబుల్ వైర్ల చోరీ కేసును సుల్తాన్ బజార్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు కార్మికులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.2.5 లక్షల విలువైన 120 మీటర్ల కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ఉపయోగించిన బొలెరో వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు.
ఎంజే మార్కెట్ వద్ద కేబుల్స్ చోరీ
బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పి. భాగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నవంబర్ 26, 2026 రాత్రి 11.30 గంటల సమయంలో ఎంజే మార్కెట్ రోడ్డులోని హనుమాన్ దేవాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు భూగర్భంలో ఉన్న రాగి కేబుల్ వైర్లను దొంగిలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బొలెరోలో తరలిస్తుండగా పట్టివేత
దర్యాప్తులో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ సమీపంలో టీజీ 13 యూ 1822 నంబరు గల బొలెరో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. అందులో సుమారు 120 మీటర్ల పొడవైన రాగి కేబుల్ వైర్లు ఉన్నట్లు గుర్తించి, వాహనంతో పాటు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేబుల్స్ విలువ సుమారు రూ.2.5 లక్షలుగా అంచనా వేశారు. ఈ చోరీకి సంబంధించి ఆరుగురు కార్మికులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని చోరీలపై విచారణ
సుల్తాన్ బజార్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. నరేశ్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ చోరీలో మరికొందరి ప్రమేయం ఉందా? ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కేబుల్ వైర్లను దొంగిలించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని దొంగిలించిన కేబుల్స్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.