Sathya Velugu, 28 నవంబర్ 2026: దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమ సీనియర్ల ముందు తలవంచి ‘ప్రణామ్ మహోదయ్’ అంటూ నమస్కరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం 38 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంది. సస్పెన్షన్‌తో పాటు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున జరిమానా విధించడమే కాకుండా, వారి స్కాలర్షిప్లను ఏడాది పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
2026 బ్యాచ్‌కు చెందిన మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు హాస్టల్ నుంచి తరగతి గదులకు వెళ్లే సమయంలో సీనియర్లు వారిని వేధిస్తున్నారని, తప్పనిసరిగా ‘ప్రణామ్ మహోదయ్’ అని పలకరించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కేజీఎంయూలోని కలాం సెంటర్ వెలుపల జూనియర్ విద్యార్థులు తలలు వంచి ‘ప్రణామ్ మహోదయ్ జీ’ అంటూ సీనియర్లకు నమస్కరిస్తున్న దృశ్యాలు, అక్కడే ఉన్న కొందరు ఆ ఘటనను వీడియో తీస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో వర్సిటీలో ర్యాగింగ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ వీడియో వైరల్ అయిన తొలినాళ్లలో కేజీఎంయూ అధికార ప్రతినిధి డాక్టర్ కె.కె. సింగ్ స్పందిస్తూ.. జూనియర్లు గౌరవ సూచకంగానే సీనియర్లను అలా పలకరించారని, ఫిర్యాదు అందితే నిబంధనల ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అనంతరం ఈ ఘటనపై యాంటీ-ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపి సమర్పించిన నివేదిక ఆధారంగా వైస్ ఛాన్సలర్ కఠిన చర్యలకు ఆమోదం తెలిపారు. డీన్ అకడమిక్స్ డాక్టర్ వీరేంద్ర ఆతమ్ తక్షణమే అమల్లోకి వచ్చేలా 38 మంది విద్యార్థులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో 2025 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్లతో పాటు, ర్యాగింగ్ సమయంలో సీనియర్లకు సహకరించిన ఇద్దరు జూనియర్ విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. ఈ ఉత్తర్వుల ప్రకారం సస్పెన్షన్‌కు గురైన 38 మంది విద్యార్థులు మూడు నెలల పాటు తరగతులకు హాజరుకావడానికి, యూనివర్సిటీ హాస్టల్లో ఉండటానికి వీల్లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.