Sathya Velugu, 28 నవంబర్ 2026: ఆసుపత్రిలో చికిత్స.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు
ఏఎన్ఎం కీర్తిని సస్పెండ్ చేయాలి
ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుజిత డిమాండ్
మరిపెడ, ఆంధ్రప్రభ :
మండలంలోని ఆనేపురం రెవెన్యూ గ్రామ పరిధి వెంకట్యాతండాకు చెందిన ఆశా కార్యకర్త గుగులోతు భార్గవి వేతనం అందకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే స్పందించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించి మాత్రలను బయటకు వచ్చేలా చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని, భయాందోళనల కారణంగా రక్తపోటు పెరుగుతోందని వైద్యులు తెలిపారు.
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గత రెండు రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భార్గవికి రావాల్సిన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. శనివారం రెండో రోజు ఆందోళనలో పాల్గొన్న భార్గవి ఒక్కసారిగా లేచి ఆసుపత్రిలోకి వెళ్లి మాత్రలు మింగింది. దీంతో ఆందోళనకు గురైన ఆశా కార్యకర్తలు వైద్యులకు సమాచారం అందించారు. డాక్టర్ పూజిత వెంటనే స్పందించి ఆమెకు చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆసుపత్రికి చేరుకుని భార్గవి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలి
ఆనేపురం ఏఎన్ఎం ఎర్రబెల్లి కీర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజిత డిమాండ్ చేశారు. ఏఎన్ఎం కీర్తి వ్యవహారశైలి వల్లే వెంకట్యాతండాకు చెందిన ఆశా కార్యకర్త భార్గవి ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై భార్గవిని పరామర్శించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుజిత మాట్లాడారు.
భార్గవి విధులకు హాజరవుతున్నప్పటికీ, విధులు నిర్వహించడం లేదని, బూత్‌కు రావడం లేదని స్థానిక ఏఎన్ఎం కీర్తి శాఖకు తప్పుడు నివేదికలు పంపుతున్నారని సుజిత ఆరోపించారు. ఇప్పటికైనా కీర్తి తన పద్ధతిని మార్చుకుని ఆశా కార్యకర్తలకు సహకరించాలని కోరారు. తప్పుడు నివేదికల వెనుక ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భార్గవికి ఏదైనా జరిగితే స్థానిక వైద్యులు, ఏఎన్ఎం కీర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
భార్గవికి రావాల్సిన నెలవారీ వేతనాన్ని వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలను సమీకరించి కలెక్టరేట్, డీఎంహెచ్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని సుజిత హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొండ ఉప్పలయ్య, కొండ వెంకన్న, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్లకొండ ఉపేంద్ర, మండల అధ్యక్షురాలు ఎస్.కె. ఆసియా, కార్యదర్శి సునీత, అరుణ, పద్మ, జ్యోతి, ఇంద్రజ, రేణుక, శారద, స్వరూప, శోభ, ధనమ్మ, పార్వతమ్మ, భార్గవి తదితరులు పాల్గొన్నారు.