Sathya Velugu, 28 నవంబర్ 2026: దిశ, నేషనల్ బ్యూరో: ఒంటరి తల్లుల పెంపకంలో పెరిగే పిల్లలకు ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే నిబంధనలను సమీక్షించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం తండ్రి కులం ఆధారంగానే పిల్లల కులాన్ని నిర్ధారించే నిబంధన అమల్లో ఉంది. అయితే విడాకులు తీసుకున్న, భర్త వదిలేసిన లేదా తల్లి సంరక్షణలో మాత్రమే పెరుగుతున్న పిల్లల విషయంలో తల్లి కులం ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు అందించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం సూచించింది. రిటైర్డ్ టీచర్ సంతోష్ కుమారి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ జరిపింది. కుల ధృవీకరణ పత్రాల జారీ రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నప్పటికీ, కేంద్రం చొరవ తీసుకుని మార్గదర్శకాలు రూపొందిస్తే రాష్ట్రాలకు సూచించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ ప్రయోజనం దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, తల్లి కులం ఆధారంగా సర్టిఫికెట్ ఇచ్చే అంశంపై పరిశీలించి డిసెంబర్ 9 లోగా స్పందన తెలపాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
తల్లి కులంతోనూ రిజర్వేషన్?.. ఓబీసీ సర్టిఫికెట్స్ జారీపై ఆలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశం