Sathya Velugu, 29 నవంబర్ 2026: దిశ, నేషనల్ బ్యూరో: ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్ వంటి ముఖాన్ని పూర్తిగా కప్పే వస్త్రాలను నిషేధిస్తూ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద విద్యా చట్టానికి (‘డెక్రెటో స్కూలా’) పార్లమెంట్ తుది ఆమోదం తెలిపింది. సెనేట్ ఆమోదం తర్వాత నవంబర్ 26–27 తేదీల్లో దిగువ సభ (ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్)లో 142-112 ఓట్ల తేడాతో ఈ బిల్లు పాస్ అయింది. ముఖం కనిపించే హిజాబ్, వైద్య కారణాలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, పాఠశాల కార్యకలాపాలు, తల్లిదండ్రుల సమావేశాల్లో ముఖాన్ని కప్పుకునే నిబంధనలను ఉల్లంఘిస్తే 200 నుండి 1,000 యూరోల వరకు (భారత కరెన్సీలో రూ. 90 వేలకు పైగా) జరిమానా విధించనున్నారు. మైనర్ల విషయంలో తల్లిదండ్రులనే బాధ్యులను చేస్తారు. దీనికి తోడు 2027–28 విద్యా సంవత్సరం నుండి మొదటి తరగతి గదుల్లో ఇటాలియన్ భాషా ప్రావీణ్యం లేదా నిర్ణీత ప్రీ-స్కూల్ విద్య లేని విదేశీ విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేయడంతో పాటు విదేశీ తల్లిదండ్రులకు ఇటాలియన్ భాషా కోర్సులు అందించాలని చట్టం పేర్కొంది. లింగ సమానత్వం, సమైక్యత కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం సమర్థించుకోగా, ఇది వలస వచ్చినవారు, ముస్లిం విద్యార్థుల పట్ల వివక్ష చూపడమేనంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్లకార్డులతో నిరసన తెలిపాయి.
Italy: మెలోని ప్రభుత్వం తెచ్చిన 'డెక్రెటో స్కూలా' చట్టానికి పార్లమెంట్ ఆమోదం