Sathya Velugu, 29 నవంబర్ 2026: ఒంగోలులో దారి దోపిడీ ఘటన కలకం రేపింది. చెన్నైకు చెందిన బంగారు వ్యాపారుల నుంచి నగలు చోరీ చేసిన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి 60 లక్షల విలువైన 504 గ్రాముల బంగారు నగలు, ఓ ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 3వ తేదిన ఒంగోలులో తమిళనాడుకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులను అడ్డగించి, అనంతరం బలవతంగా కారులో ఎక్కించుకుని కత్తులతో బెదిరించి వారి దగ్గర ఉన్న బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్ళారు. బాధితుడు బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న ప్రకాశంజిల్లా ఎస్పి హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన వ్యాపారుల బంగారాన్ని.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన నిందితులు దోపిడీ చేసినట్టు తేలింది. నిందితుల్లో ఒకరు నాగరాజు మురుగేషన్ ఫిర్యాదుదారుడు బాలాజీకి స్వయానా బావ కావడం విశేషం.. నిందితుల స్వస్థలం తమిళనాడు రాష్త్రం కోయంబత్తూరు అని పోలీసులు తెలిపారు.
బావ, బామ్మర్దుల మధ్య విభేదాలే దోపిడీకి కారణం..
బాలాజీ సొంత చెల్లెలును మురుగేషన్ వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాలాజీ, నిందితుడు మురుగేషన్ ఇద్దరూ కలిసి బంగారపు వ్యాపారం చేస్తూ ఒంగోలు ప్రాంతానికి తరచుగా వచ్చేవారు. మురుగేషన్ బంగారం వ్యాపారం చేస్తూ తన బావమరిది బాలాజీని తన దగ్గర పనిలో పెట్టుకున్నడు. వ్యాపారంలో ఆటుపోట్లు తలెత్తగా.. బాగా నష్టపోయాడు మురుగేషన్… అదే సమయంలో తన బావమరిది బాలాజీ అదే బంగారం వ్యాపారంలో లాభాలు గడిస్తున్నాడు. తరచుగా ఒంగోలు ప్రాంతంలో బిల్లులు లేని బంగారాన్ని షాపులకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడు.
ఇటీవల కాలంలో బంగారం అమ్మే నిమిత్తం బాలాజీ తరచుగా ఒంగోలుకు వెళ్తున్నాడని.. ఆ సమయాన్ని అనుకూలంగా మల్చుకోవాలని మురుగేషన్ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే బాలాజీ వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉంటుందని అతను రైలులో ప్రయాణం చేస్తున్నాడని తెలిసి, మురుగేషన్ తన స్నేహితుడైన దేవరాజ్ ప్రభుని కలిశాడు. వీరితోపాటు రమేశ్, సమీర్, ఖాజా హుస్సేన్, రాంకుమార్ తదితరులు మెత్తం 13 మంది కలిసి దొంగతనం చేయటానికి ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఈనెల 3వ తేదిన బాలాజీ, అతని కుమారుడు బంగారం తీసుకొని ఒంగోలుకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఒంగోలుకు బయలుదేరడాన్ని గమనించి ఇన్నోవా కారులో నిందితులు కూడా ఒంగోలుకు చేరుకుని మాటు వేశారు.
బాలాజీ, అతని కొడుకు ఒంగోలుకు చేరుకున్న తర్వాత.. దారిలో వారిని కత్తులతో బెదిరించి బంగారు నగలు ఎత్తుకెళ్ళారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఙానం ఉపయోగించి 6 గురు నిందితులను అరెస్ట్ చేశారు… నిందితుల నుంచి 60 లక్షల విలువైన 504 గ్రాముల బంగారు నగలు, ఓ ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సి.సి.ఎస్ కమలాకర్, ఒంగోలు సిసియస్ సిబ్బంది ఎస్ఐ వెంకటేశ్వర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సంధాని బాషా, కృష్ణా, కానిస్టేబుళ్ళను ప్రకాశం జిల్లా ఎస్పి హర్షవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.