రూ.12.21 లక్షలు వసూలు.. నకిలీ రుణ మంజూరు పత్రాల సృష్టి
నిందితుడిని అరెస్టు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు
కరీంనగర్, ఆంధ్రప్రభ : రుణాలు ఇప్పిస్తానంటూ ఆన్లైన్లో ప్రచారం చేసుకుంటూ, రుణం మంజూరైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వొడ్నాల జగన్ కుమార్తె వైష్ణవి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతరుల ద్వారా ఆమెకు పరిచయమైన సాయికృష్ణ రుణం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఆరెపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 232/ఆలో ఉన్న 383.02 గజాల ఇంటి స్థలంపై రూ.కోటి 50 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పాడు. టాటా క్యాపిటల్ ఫైనాన్స్ ద్వారా రుణం మంజూరవుతుందని నమ్మబలికాడు. ఇందుకోసం మొదటి విడతగా ఇన్సూరెన్స్ పేరుతో రూ.8.99 లక్షలు చెల్లించాలని కోరాడు. దీంతో వైష్ణవి నిందితుడి సాయికృష్ణ బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. అనంతరం రుణం, పత్రాల ప్రాసెసింగ్ పేరుతో రెండో విడతగా మరో రూ.3.22 లక్షలు వసూలు చేశాడు.
ఆ తర్వాత రుణం మంజూరైనట్లు నకిలీ పత్రాలను జగన్‌కు అందజేశాడు. వాటిని తీసుకుని సంబంధిత ఫైనాన్స్ సంస్థను సంప్రదించగా, తమ సంస్థ నుంచి ఆ పత్రాలు జారీ కాలేదని సిబ్బంది వెల్లడించారు. వాటిపై ఉన్న సంతకాలు కూడా తమ బ్యాంకు అధికారులవి కావని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వేల్పుల సాయికృష్ణను అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన అతడు ప్రస్తుతం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. నిందితుడిని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడు తయారు చేసిన రుణ మంజూరు నకిలీ పత్రాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో పాటు మోసానికి సంబంధించిన ఇతర ఆధారాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఇందుకోసం నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.