దంతన్‌పల్లి శివారులో ఘటన.. పరిశీలించిన అటవీ శాఖ అధికారులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ :
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి సమీపంలోని దంతన్‌పల్లి గ్రామ శివారులో శనివారం కుక్కల దాడిలో జింక మృతి చెందింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల సమీపంలో సంచరిస్తున్న జింకపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. జింకపై కుక్కలు దాడి చేసి చంపి, పీక్కుతిన్నాయి. అటువైపు వెళ్లిన వారు ఈ ఘటనను గమనించి అటవీ శాఖ అధికారి కమాలొద్దీన్కు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ సంతోష్ సంఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం నిబంధనల ప్రకారం జింక మృతదేహాన్ని ఖననం చేశారు.
ఇటీవల మండల పరిధిలోని గ్రామాల శివారుల్లో కుక్కల దాడులకు జింకలు బలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల నుంచి గ్రామాల వైపు వచ్చే వన్యప్రాణులకు కుక్కల నుంచి రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి జింకల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామ శివారుల్లో సంచరించే వీధి కుక్కల నియంత్రణకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.