దిశ, వెబ్ డెస్క్: యూపీలోని గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిర్వహించిన పాదయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ర్యాలీలో పూలు చల్లుతూ వేగంగా వస్తున్న బుల్డోజర్ స్థానిక బీజేపీ నాయకుడి 14ఏళ్ల కుమారుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మరణించాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం గోరఖ్‌పూర్‌లో 2గంటల ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అఖిలేష్ కాన్వాయ్ పై పూలవర్షం కురిపిస్తున్న బుల్డోజర్ రోడ్డు దాటుతున్న ఆర్యవర్ధన్ సింగ్‌ను ఢీ కొట్టింది.
తీవ్రగాయాలై ఆర్యవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్యవర్ధన్ తండ్రి ఓంకార్ సింగ్ స్థానిక బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఊరేగింపులో నిర్వహణ లోపం కారణంగానే తమ కుమారుడు ప్రమాదానికి గురై మరణించాడని ఓంకార్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మరణానికి నిర్వాహకులే కారణం అని చెప్పాడు. అఖిలేష్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. తన కుమారుడు హత్యకు గురయ్యాడని, తాను దీనిని హత్య అనే అంటానని చెప్పాడు. ఈ ఘటన యూపీలో హాట్ టాపిక్ గా మారగా అఖిలేష్ యాదవ్ పై చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.