Sathya Velugu, 25 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక దిశగా అడుగులు వేస్తోంది. విదేశాల తరహాలో 16 నుంచి18 ఏళ్లలోపు పిల్లలపై పూర్తిగా నిషేధం విధించడం కంటే, సోషల్ మీడియా సంస్థలే బాధ్యత తీసుకుని వారి వినియోగాన్ని నియంత్రించేలా చూడాలని కేంద్ర ఐటీ శాఖ (MeitY) భావిస్తోంది.
‘మెటా’ తరహాలో కొత్త నిబంధనలు..
పిల్లలను సోషల్ మీడియాలోకి రాకుండా అడ్డుకోవడం కంటే, వారు సురక్షితంగా వాడుకునేలా చూడటమే మేలని అధికారులు భావస్తున్నారు. ఇందుకోసం అమెరికాలో మెటా (Meta) ప్రతిపాదించిన తరహా నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రోజుకు గరిష్టంగా రెండు గంటలు మాత్రమే వాడుకునేలా పరిమితిని విధించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కూల్ వేళల్లో నోటిఫికేషన్లు రాకుండా ఆపడం, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు యాప్ పనిచేయకుండా నియంత్రించడం వంటివి చేయనున్నారు. స్మార్ట్ డివైజ్‌ను వరుసగా 15 నిమిషాలు వాడితే ఆటోమెటిక్‌గా అలర్ట్ మెసేజ్ ఇచ్చి కాసేపు విరామం తీసుకోమని హెచ్చరికలు పంపడం చేయాలని భావిస్తున్నారు. అయితే, ఈ నిబంధనలను సడలించాలన్నా, మార్చాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు.
పూర్తి నిషేధంపై నిపుణుల అభ్యంతరం..
అయితే, గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించింది. కానీ, పిల్లలు తప్పుడు పుట్టిన తేదీలు ఇచ్చి కొత్త అకౌంట్లు తెరవడంతో ఆ నిషేధం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. భారత్‌లోనూ పూర్తి నిషేధం విధిస్తే పిల్లలు నియంత్రణ లేని ఇతర ప్రమాదకర యాప్‌ల వైపు వెళ్లే ప్రమాదం ఉందని, పైగా వయసు నిర్ధారణ పేరుతో కంపెనీలు ప్రజల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, డేటాను ఎక్కువగా సేకరిస్తే అది సైబర్ భద్రతకు ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక కొత్త విధానం ఎలా ఉన్నా.. భారత్‌లో అమల్లో ఉన్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (DPDP) ప్రకారం 18 ఏళ్లలోపు వారందరూ చిన్నారులే. వారి డేటాను వాడుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. అందుకు అనుగుణంగానే వాట్సాప్ ఇప్పటికే భారత్‌లో కొందరు యూజర్ల పుట్టిన తేదీని నిర్ధారించుకునే ప్రక్రియను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. మొత్తానికి, పిల్లలను సోషల్ మీడియాకు దూరం చేయడం కంటే, ఆ ప్లాట్‌ఫారమ్‌లనే పిల్లలకు సురక్షితంగా మార్చడమే సరైన పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ కీలక నిర్ణయం తీసుకోబోతోంది.