Sathya Velugu, 27 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: చదువులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై ఓ భారతీయ విద్యార్థి అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంతో చాకచక్యంగా, ఆలోచింపజేసే సమాధానం ఇచ్చారు. ఏఐపై పూర్తిగా ఆధారపడటం వల్ల విద్యార్థుల ఆలోచనా శక్తి దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. మాస్కో వేదికగా జరిగిన ఓ ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ విద్యార్థి రౌల్ జాన్ అజు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ.. గణితం (Maths) నేర్చుకోవడంలో ఏఐ పాత్ర గురించి ప్రశ్నించారు. ‘సర్, నాకు గణితం అంటే చాలా ఇష్టం. ఏకాగ్రత కోల్పోకుండా, ఎంతో సరదాగా నేర్చుకోవడానికి వీడియోలు, గేమ్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది?’ అని అడిగారు.
నవ్వుతూ.. పుతిన్ స్మార్ట్ ఆన్సర్..
అందుకు ప్రెసిండెంట్ పుతిన్ నవ్వుతూ ‘నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, విషయాలను ఎలా గుర్తుంచుకోవాలి, సొంతంగా ఎలా నేర్చుకోవాలి అనేది నీకు కచ్చితంగా తెలిసి ఉండాలి. ప్రస్తుత రోజుల్లో ఏఐని ఒక సహాయకుడిగా వాడుతున్నారు. దీంతో మనుషులు సొంతంగా ఆలోచించడం మానేస్తున్నారు. కాబట్టి, ఏఐపై అతిగా ఆధారపడటం విద్యా విధానానికే ఒక పెద్ద ముప్పు అని నువ్వు అనుకోవడం లేదా?’అంటూ ఎదురు ప్రశ్నించి ఆలోచింపజేశారు. ఈ మాటలు విన్న భారతీయ విద్యార్థి రౌల్ జాన్ అజు ఏమాత్రం తడబడకుండా ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. ‘సర్, మనం ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా, దానితో కలిసి పనిచేయాలని నేను భావిస్తున్నాను’ అని తెలిపారు. విద్యార్థి ఆలోచనా విధానం, దానికి పుతిన్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.