తాటి చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ఒకరి పరిస్థితి విషమం
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని హస కొత్తూర్ గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కమ్మర్ పల్లి నుంచి హస కొత్తూర్ వైపు కూలీ పనులకు వెళ్తున్న అనిల్, రాజన్న ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టును ఢీకొట్టింది. దీంతో వాహనం పొలంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ సదానంద్, పైలట్ రమేష్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖం, కంటికి తీవ్ర గాయాలైన అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం లేదా వాహనం అదుపుతప్పడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది.