భర్తతో వాగ్వాదం నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. భర్తతో జరిగిన వాగ్వాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె శివాజీ చౌక్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు భర్త రవితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య, అత్తవారితో కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.