Bihar | ఆరుగురు మృతి…
వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లిన స్కార్పియో..
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
Bihar | బిహార్, ఆంధ్రప్రభ : బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి లోతైన కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అరారియా జిల్లాలోని తారాబారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుపౌల్ జిల్లా పిప్రా ప్రాంతంలోని థుమ్హా గ్రామానికి చెందిన ఏడుగురు స్కార్పియో వాహనంలో సిక్టీ ప్రాంతంలోని భప్టియా గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో బీడీ వంతెన వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపు దగ్గర స్కార్పియో అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు అరారియాలోని సదర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నీరజ్ కుమార్ తెలిపారు.
మృతులను యశ్ కుమార్ (15), ఆదిత్య ఆనంద్ (18), ఆర్యన్ (15), కుందన్ కుమార్ (26), సౌరభ్ (16), మున్నా కుమార్ (14)గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారు. పెళ్లి వేడుకలో సంతోషంగా గడిపి ఇంటికి తిరిగివస్తున్న వారు ఇలా విగతజీవులుగా మారడంతో థుమ్హా గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.