- అరగంటలో రెండు చోట్ల కాల్పులు..
మొహాలి, ఆంధ్రప్రభ :
పంజాబ్‌లోని మొహాలి నగరంలో శనివారం అరగంట వ్యవధిలో రెండు చోట్ల కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు ముసుగు ధరించిన యువకులు తొలుత సెక్టార్ 79లోని హెయిర్ మాస్టర్స్ సెలూన్‌పై కాల్పులు జరిపారు. అనంతరం ఫేజ్ 11లోని ఆర్కిటెక్ట్, రియల్టర్ హర్‌ప్రీత్ సింగ్ ఇంటిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదు.
మొదట సెలూన్ వద్దకు చేరుకున్న నిందితులు కొంత దూరంలో బైక్‌ను నిలిపి, నడుచుకుంటూ వెళ్లి హెయిర్ మాస్టర్స్ సెలూన్ అద్దాల తలుపుపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో అద్దం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఒక ఖాళీ తూటా లభించింది. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే మొహాలి క్లబ్ సమీపంలోని ఫేజ్ 11లో హర్‌ప్రీత్ సింగ్ ఇంటిపై అదే ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్స్టర్ల కోసం పనిచేస్తున్న షూటర్లు వసూళ్లకు పాల్పడే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు చేసి ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సెలూన్‌పై గతంలోనూ కాల్పులు జరిగాయి. సెప్టెంబర్ 2న సీపీ-67 మాల్ ఎదురుగా ఉన్న హెయిర్ మాస్టర్స్ సెలూన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సెలూన్ నిర్వాహకుడు సాహిల్ కపూర్‌కు కొంతకాలంగా బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు సమాచారం.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలన..
అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) గౌతమ్ చీమా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒక ఖాళీ తూటాను స్వాధీనం చేసుకున్నామని, కాల్పులకు ఉపయోగించిన ఆయుధం రకాన్ని నిర్ధారిస్తున్నామని తెలిపారు. నిందితులు పారిపోయిన మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. గతంలో సెలూన్‌పై జరిగిన కాల్పుల కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరిని చండీగఢ్ పోలీసులు, మరొకరిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు.
మొహాలి ఎస్ఎస్పీ వరుణ్ శర్మ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. సెక్టార్ 79 నుంచి ఫేజ్ 11 వరకు ఉన్న ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిందితుల కదలికలు, వారు తప్పించుకున్న మార్గాన్ని గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.