Tamil Nadu | ఒకే ఫ్యామిలీలో ఐదుగురి అనుమానాస్పద మృతి..!
బావిలో మృతదేహాలు
తమిళనాడులో హృదయవిదారక ఘటన..
భార్యాభర్తలు, కుమార్తె, ఇద్దరు చిన్నారులు మృతి
Tamil Nadu | కరూర్, ఆంధ్రప్రభ : తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యవసాయ క్షేత్రంలోని బావిలో శవమై కనిపించడం కలకలం రేపింది. కరూర్ జిల్లా వంగల్ సమీపంలోని చిన్నకాళిపాళయం గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
బావిలో తేలిన ఐదుగురి మృతదేహాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామస్వామి (63), ఆయన భార్య జానకి (60), కుమార్తె సుగుణ (35), మనవలు శివాని (10), అధిరన్ (4) వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించారు. బావిలో మృతదేహాలు తేలి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వంగల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నుంచి ఐదుగురి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే కారణమా?
ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో సుగుణకు తన భర్తతో విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా ఆమె గత కొన్ని రోజులుగా ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూపులు…
ఐదుగురూ బావిలోకి దూకడానికి ముందు ఒకరికొకరు కట్టేసుకున్నారంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు గల కచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.