మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి.. వాహనాల దహనం
పరస్పరం రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : తాడిపత్రి పట్టణం మరోసారి రణరంగంగా మారింది. శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కార్లు, ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి వర్గీయులు రాళ్లతో దాడులకు దిగారు. ఇరువర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నాయి. దీంతో తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసి విజయం సాధించిందని పెద్దారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే విధంగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా భయాందోళనలు కలిగించేందుకే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు తాడిపత్రిలో హింసాత్మక ఘటనలకు తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజలు వైసీపీని, ముఖ్యంగా పెద్దారెడ్డిని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.