దిశ, తెలంగాణ బ్యూరో: రహదారుల నిర్మాణంలో సహజ వనరుల వాడకాన్ని తగ్గించి, పారిశ్రామిక వ్యర్థాలను పునర్ వినియోగించడం ద్వారా పర్యావరణహితమైన, మన్నికైన రహదారులను నిర్మించవచ్చని చెన్నైలోని హైవేస్ రీసెర్చ్ స్టేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) వార్షిక సదస్సులో భాగంగా మిర్ అలీ నవాజ్ జంగ్ హాల్లో నిర్వహించిన ‘టెక్నికల్ సెషన్-19’ లో నిపుణులు కీలక పరిశోధన పత్రాలను సమర్పించారు. డెన్స్ బిటుమినస్ మకాడమ్ (డీబీఎం) మిశ్రమాల్లో సంప్రదాయ ఫిల్లర్లకు బదులుగా గాజు పొడి (2 శాతం), ఉక్కు పరిశ్రమ వ్యర్థమైన జీజీబీఎస్ (1 శాతం), విద్యుత్ కేంద్రాల ఫ్లై యాష్ (4 శాతం) వినియోగించడంపై చేసిన ప్రయోగశాల పరీక్షల ఫలితాలను వెల్లడించారు. వీటిలో జీజీబీఎస్ 99.2 శాతం టెన్సైల్ స్ట్రెంత్ రేషియోతో అత్యుత్తమ తేమ నిరోధకతను కనబరచగా, ఫ్లై యాష్ వాహనాల రద్దీ వల్ల రోడ్లపై ఏర్పడే గాడులను (రట్టింగ్) సమర్థవంతంగా నిరోధించిందని వివరించారు.
లీడ్ రబ్బర్ బేరింగ్స్..
ఇదే సెషన్లో ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. 1976 నుంచి ఇప్పటివరకు దేశ, విదేశాల్లో 131 కి పైగా అంతర్జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు. హరిద్వార్‌లో గంగా నదిపై 2.5 కి.మీ వంతెన, మహారాష్ట్రలో 4.18 కి.మీ సొరంగ మార్గంతో కూడిన 8 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ అనుభవాలను పంచుకున్నారు. భూకంపాల సమయంలో వంతెనల భద్రత కోసం ‘లీడ్ రబ్బర్ బేరింగ్స్’ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. చివరగా, సుస్థిర నిర్మాణ సామగ్రి వినియోగం, నాణ్యమైన ఇంజనీరింగ్ విధానాలతో రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సెషన్ చైర్మన్ సూచించారు.