Sathya Velugu, 23 నవంబర్ 2026: దిశ, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం పేరును మార్చేందుకు అక్కడి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఆంగ్ల నామమైన ‘వెస్ట్ బెంగాల్’ స్థానంలో బెంగాలీ పేరైన పశ్చిమ బంగా (Paschim Banga)ను అధికారికంగా ఖరారు చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సదరు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానించి అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారుజ
పేరు మార్పునకు ప్రధాన కారణం ఇదే..
ప్రస్తుతం రాష్ట్ర పేరు ఆంగ్ల అక్షరమాల ప్రకారం W (West Bengal)తో ప్రారంభమవుతోంది. దీంతో జాతీయ స్థాయి సమావేశాలు, ముఖ్యమంత్రుల సదస్సులలో బెంగాల్ ప్రతినిధులకు అక్షర క్రమం ప్రకారం చిట్టచివరి వరుసలో మాట్లాడే అవకాశం వస్తోంది. ఈ సమస్యను అధిగమించి, రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యత దక్కేలా చేసేందుకే ‘P’ తో మొదలయ్యేలా పేరు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలోనూ ప్రయత్నాలు..
అయితే రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదన కొత్తదేమీ కాదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి జ్యోతి బసు హయాంలోనూ, ఆ తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంలోనూ పేరు మార్పు కోసం పలుమార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే, వివిధ కారణాల వల్ల ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.