Sathya Velugu, 24 నవంబర్ 2026: కనుమూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోనే తిష్ట
మూడు రోజులుగా కొండల్లోనే సంచారం.. జీపీఎస్ ట్రాకర్‌తో నిరంతర నిఘా
పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందం.. పులిని పట్టుకునేందుకు రెండు బోన్లు
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు ఏర్పాట్లు
సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన.. అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
Explorer Tiger | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో :
ఎన్టీఆర్ జిల్లాలో సంచరిస్తున్న ‘ఎక్స్‌ప్లోరర్’ పెద్దపులి అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. జిల్లాలోకి ప్రవేశించి వారం రోజులు గడుస్తున్నా దాని ఆచూకీ మాత్రం కచ్చితంగా లభించడం లేదు. పులి కదలికలను తెలుసుకునేందుకు జీపీఎస్ ట్రాకర్ సాయంతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నప్పటికీ, దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తుండటంతో పట్టుకోవడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం గంపలగూడెం మండలంలోని కనుమూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిసర కొండల్లోనే మూడు రోజులుగా తిష్ట వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించడంతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. పులికి ఎలాంటి హాని కలగకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పులి ఎప్పుడు తమ గ్రామాల వైపు వస్తుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్ర నుంచి పాపికొండల మీదుగా..
అటవీ శాఖ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పెద్దపులి మహారాష్ట్ర అడవుల నుంచి ప్రయాణం ప్రారంభించి పాపికొండల మీదుగా ఏలూరు జిల్లా అటవీ ప్రాంతాలకు చేరుకుంది. అక్కడి చాట్రాయి మండలం రమణక్కపేట అడవుల నుంచి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని కొండపర్వ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ పులికి ‘ఎక్స్‌ప్లోరర్’ అనే పేరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత బుధవారం జిల్లాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అటవీ ప్రాంతాలకే పరిమితమవుతూ సంచరిస్తున్నట్లు గుర్తించారు.
ట్రాకర్‌తో నిరంతర నిఘా..
పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దానికి అమర్చిన ట్రాకర్ ద్వారా అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ట్రాకర్ నుంచి అందే సమాచారంతో అది ఏ ప్రాంతంలో సంచరిస్తోందో అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంపలగూడెం మండలంలోని కనుమూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే మూడు రోజులుగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అటవీ ప్రాంత సరిహద్దు వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ప్రయాణించిన పెద్దపులి తిరిగి కనుమూరు కొండల వైపు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
దట్టమైన అడవిలో గుర్తించడం కష్టమే..
గంపలగూడెం మండలంలోని కనుమూరు పరిసర కొండ ప్రాంతం దట్టమైన వృక్షసంపదతో ఉండటంతో పులిని ప్రత్యక్షంగా గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. అడుగుజాడలు, కదలికలను గుర్తిస్తున్నప్పటికీ అది ఏ ప్రాంతంలో ఉందో కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. దట్టమైన అడవిలోకి వెళ్లి పులిని అనుసరించడం ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సురక్షితంగా బంధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందం..
పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం పూణే నుంచి నిపుణుల బృందాన్ని రప్పించారు. పులికి ఎలాంటి గాయాలు కాకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించడంలో అనుభవం ఉన్న నిపుణులను రంగంలోకి దించారు. రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. పులి కదలికలు, సంచరించే ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తూ అనువైన సమయంలో దాన్ని బంధించేందుకు సిద్ధమవుతున్నారు.
కొండ ప్రాంతాల్లో సమృద్ధిగా ఆహారం..
కనుమూరు కొండ ప్రాంతాల్లో వందకు పైగా ఆవులు ఉన్నట్లు స్థానిక సమాచారం ద్వారా తెలుస్తోంది. చాలాకాలంగా ఈ పశువులు అక్కడే మేత మేస్తుండటంతో వాటి సంఖ్య క్రమంగా పెరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోనే పులికి ఆహారం లభిస్తుండటంతో అడవిని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదని అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో గత మూడు రోజులుగా ఇదే ప్రాంతంలో తిష్ట వేసినట్లు భావిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
పులి సంచారంతో కనుమూరు, పరిసర అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. పశువుల మేత కోసం కొండ ప్రాంతాలకు వెళ్లేవారు, అడవుల్లోకి వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కనుమూరు కొండ ప్రాంతాల పరిసరాలకు ఎవరూ వెళ్లవద్దని, పశువులను మేపేందుకు కూడా అటువైపు తీసుకెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.