Sathya Velugu, 26 నవంబర్ 2026: దిశ, డైనమిక్ బ్యూరో: భారత సైన్యం మరో అరుదైన ఘనత సాధించింది. జాతీయ రహదారులను అత్యవసర విమాన ల్యాండింగ్ కేంద్రాలుగా ఉపయోగించుకునే అవకాశాలను పరీక్షిస్తూ.. తొలిసారిగా నాలుగు మైక్రోలైట్ విమానాలతో విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ నిర్వహించింది. గుజరాత్లోని అమృత్సర్-జామ్నగర్ ఎకనామిక్ కారిడార్ (NH-754A)పై ఈ విన్యాసాన్ని చేపట్టింది. సైన్యం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మధ్య సమన్వయానికి ఈ ప్రయోగం నిదర్శనంగా నిలిచింది. భారత సైన్యానికి చెందిన ‘టీమ్ మౌంటైన్ ఈగిల్స్’ ఈ విన్యాసంలో పాల్గొంది.
తొలిసారిగా నాలుగు విమానాలతో..
ఇందులో రెండు ఫిక్స్డ్ వింగ్ మైక్రోలైట్ విమానాలు, రెండు పవర్డ్ హ్యాంగ్ గ్లైడర్లు ఉన్నాయి. గుజరాత్లోని కచ్ జిల్లా కాండ్లా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ నాలుగు విమానాలు.. పటాన్ జిల్లాలోని సంతల్పూర్ తాలూకాలో బకుత్రా టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యాయి. అనంతరం అక్కడే ఇంధనం నింపుకుని తిరిగి టేకాఫ్ తీసుకున్నాయి. కిలోమీటర్ 946 నుంచి 949 మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై నాలుగు విమానాల బృందంతో విజయవంతంగా ల్యాండింగ్, ఇంధనం నింపడం నిర్వహించడం ఇదే తొలిసారి. భారత సైన్యం, NHAI, స్థానిక అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విమానాల రాకపోకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
నితిన్ గడ్కరీ అభినందనలు
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విన్యాసానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భారత సైన్యం, NHAI మధ్య సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం చారిత్రాత్మకమని.. దేశంలోని జాతీయ రహదారులు కేవలం రవాణా అవసరాలకే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాల వ్యూహాత్మక, కార్యాచరణ అవసరాలకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. పర్యాటకం, ఏరో అడ్వెంచర్ కార్యకలాపాలకు సైతం భద్రతా ప్రమాణాలు, తగిన సమన్వయంతో వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించారు.