Sathya Velugu, 27 నవంబర్ 2026: జైపూర్,ఆంధ్రప్రభ: ఇంట్లో తరచూ జరిగే గొడవలు చివరకు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. తల్లి, సోదరి మధ్య జరిగే వాగ్వాదాలతో విసిగిపోయిన ఓ యువకుడు ఆ ఇద్దరినీ హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పరిశీలించిన పోలీసులు పలు కీలక విషయాలను గుర్తించారు.
జైపూర్‌లో శుక్రవారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. మృతులను 50 ఏళ్ల సరోజ్ తివారీ, ఆమె కుమారుడు లక్కీ (27), కుమార్తె శివాంగి (25)గా పోలీసులు గుర్తించారు. ఇంట్లోని వేర్వేరు గదుల్లో వారి మృతదేహాలు లభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. గురువారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో లక్కీ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి సరోజ్, సోదరి శివాంగి మధ్య గొడవ జరుగుతున్నట్లు గుర్తించాడు. వారిద్దరి మధ్య తరచూ ఇలాంటి వాగ్వాదాలు జరుగుతుండటంతో లక్కీ తీవ్రంగా విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన అతడు ముందుగా తల్లిపై, ఆ తర్వాత సోదరిపై బరువైన వస్తువుతో దాడి చేసినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. వారిద్దరూ మరణించిన అనంతరం మరో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
మొబైల్ ఫోన్‌లో సూసైడ్ నోట్.. ఎలా బయటపడిందంటే?
ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ఓ కీలక ఆధారం లభించింది. లక్కీ గది సమీపంలో ఓ కాగితంపై మొబైల్ ఫోన్ పిన్ నంబర్ రాసి ఉండటాన్ని అధికారులు గమనించారు. ఆ నంబర్ సాయంతో ఫోన్‌ను తెరిచి పరిశీలించగా అందులో ఇంగ్లీష్‌లో రాసిన సూసైడ్ నోట్ కనిపించింది. తల్లి, సోదరి మధ్య తరచూ జరిగే గొడవలతో తాను తీవ్రంగా కలత చెందుతున్నట్లు లక్కీ ఆ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం జరిగిన పరిణామాలను కూడా అందులో వివరించినట్లు తెలిపారు. ఈ లేఖ ఆధారంగా ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత నేపథ్యాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబంలోని ముగ్గురు సభ్యులూ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశానికి, ఘటనకు మధ్య సంబంధం ఉందని నిర్ధారించే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. లక్కీకి స్థిరమైన ఉద్యోగం లేదని, పెద్దగా ఆదాయం లేని ఆన్‌లైన్ వ్యాపారం నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. కుటుంబం ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యేదని, పొరుగువారితో కూడా పెద్దగా సంబంధాలు కొనసాగించేది కాదని విచారణలో వెల్లడైంది.
ఈ కుటుంబంలో గతంలోనూ విషాదం చోటుచేసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. లక్కీ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కుటుంబ ఆర్థిక పరిస్థితులు, గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఫోరెన్సిక్ ఆధారాలతో కొనసాగుతున్న విచారణ
ఘటనా స్థలంలోని మూడు గదుల నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఆధారాలను సేకరించింది. మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. వారి రాక అనంతరం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ డేటా, ఫోరెన్సిక్ పరిశీలనలు, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా ప్రాణాలు కోల్పోవడం జైపూర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.