Sathya Velugu, 27 నవంబర్ 2026: దిశ, వెబ్డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఢిల్లీలోని సేవా తీర్థ్ (Seva Teerth)లో జరగనున్న ఈ భేటీకి మంత్రులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందింది. ఈ నెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ కేబినెట్ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులలో తీసుకురావాల్సిన కీలక సవరణలపై కేబినెట్ ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు-2026 అవసరమైన మెజారిటీ సాధించలేక వీగిపోయింది. దీంతో, 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చేందుకు వీలుగా లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచే డీలిమిటేషన్ ప్రతిపాదనలు, బిల్లులో చేయాల్సిన మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.