Sathya Velugu, 27 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన సేవా తీర్థ్‌లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన సంబంధిత బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జనగణనతో సంబంధం లేకుండా ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా బిల్లులోని విధివిధానాల్లో పలు మార్పులు చేశారు. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లులను త్వరలోనే పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చకు పెట్టనున్నారు.
విపక్షాల రెస్పాన్స్‌పై సస్పెన్స్..
మహిళా, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంతో దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మహిళా సాధికారతకు ఇది పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటుండగా, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలు, విపక్ష పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.