సూర్యాపేట ఆంధ్రప్రభ: తుంగతుర్తిలోని వెంపటి గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చామకూరి మహేష్(25) ఉదయం ట్రాక్టర్‌పై తన పొలానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో మాటువేసిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు మహేష్‌ను అడ్డుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి భార్య ప్రస్తుతం గర్భవతి కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. త్వరలో తండ్రి కాబోతున్న యువకుడు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమా లేక మరేదైనా కోణం ఉందా అనే దిశగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.