స్నేహితులతో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి
గాలింపు చర్యల్లో లభించిన ఆర్యన్ మృతదేహం
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ :
స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం లోయర్ మానేరు డ్యామ్ బీచ్ ప్రాంతానికి వెళ్లారు. స్నేహితులంతా కలిసి ఈత కొడుతుండగా వావిలాలపల్లికి చెందిన సందరగిరి ఆర్యన్ నీటిలో మునిగిపోయాడు. దీంతో భయాందోళనకు గురైన మిగిలిన విద్యార్థులు నీటి నుంచి బయటకు వచ్చారు.
సమాచారం అందుకున్న తిమ్మాపూర్ సీఐ అనిల్ వెంటనే గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆర్యన్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. ఈ ఘటనతో కరీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.