Sathya Velugu, 24 నవంబర్ 2026: దిశ, వెబ్డెస్క్: పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలైలో వార్షిక కార్తీక దీపోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అన్నామలై కొండ శిఖరంపై ‘మహాదీపం’ వెలిగింది. మహాదీపం వెలుగుతుండగా లక్షలాది మంది భక్తులు ‘అన్నామలైయార్కు హరోహర’, ‘శివ శివ’ నామస్మరణలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు.
ఉచ్చి పిళ్లయార్ ఆలయంలో సంప్రదాయ దీపం..
మహాదీపాన్ని వెలిగించడానికి ముందుగా, సంప్రదాయం ప్రకారం కొండపై ఉన్న ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద దీపాన్ని వెలిగించారు. కార్తీక దీపం రోజున ఈ ఆలయంలో దీపం వెలిగించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆ తర్వాత కొండ శిఖరంపై ఉన్న భారీ రాగి కొప్పరైలో నెయ్యి, వత్తులతో మహాదీపాన్ని ప్రజ్వలింపజేశారు. ఈ జ్యోతి కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ భక్తులకు కనువిందు చేసింది.
దక్షిణాది రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరువణ్ణామలైకి తరలివచ్చారు. మహాదీప దర్శనం అనంతరం అనేక మంది భక్తులు అన్నామలై కొండ చుట్టూ 14 కి.మీ. ‘గిరి ప్రదక్షిణ’ నిర్వహించారు. శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించిన రోజుగా భక్తులు కార్తీక దీపాన్ని భావిస్తారు. మహాదీపం వెలిగిన వెంటనే ఇళ్లలో, ఆలయాల్లో ప్రమిదలతో దీపాలు వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాయి. కొండపైకి భక్తుల రాకపోకలపై నియంత్రణ చర్యలు తీసుకుంటూ, రవాణా, వైద్య, తాగునీటి సౌకర్యాలను అధికారులు కల్పించారు.