Sathya Velugu, 25 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థానీ టీవీ సిరీస్ ‘దర్-ఏ-నిజాత్’ (Dar-e-Nijaat) ప్రదర్శన కోసం బెంగళూరులో ఏర్పాటు చేసిన రెండు వేర్వేరు ప్రైవేట్ స్క్రీనింగ్ ఈవెంట్లను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు, ప్రశ్నలు తలెత్తడంతో పాటు వివాదం చెలరేగడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెండు ప్రైవేట్ ఈవెంట్లకు సన్నాహాలు..
నగరంలో ఈ సిరీస్ ప్రదర్శన కోసం రెండు వేర్వేరు సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా నవంబర్ 28న ఫ్రేజర్ టౌన్‌లోని ‘షీష్కబాబ్’ వేదికగా ‘ది బ్లూమ్ సొసైటీ సిస్టర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ఈ డ్రామాకు సంబంధించిన 34, 35 ఎపిసోడ్ల ప్రదర్శనతో పాటు పెర్షియన్, అరబిక్ వంటకాలతో కూడిన డిన్నర్‌ను ప్లాన్ చేశారు. అలాగే డిసెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఒక ప్రైవేట్ థియేటర్లో ‘ది స్టార్ క్లబ్’ ఆధ్వర్యంలో మరో స్క్రీనింగ్ నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆర్.హితేంద్ర స్పందించారు. ఈ వ్యవహారంపై నిర్వాహకులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని, నిబంధనల ఉల్లంఘన జరిగితే అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడం, వివాదం తీవ్రరూపం దాల్చడంతో రెండు కార్యక్రమాల నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్క్రీనింగ్ ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. రద్దుకు సంబంధించి నిర్వాహకులు ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు వెల్లడించనప్పటికీ, నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే కార్యక్రమాలను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.