Sathya Velugu, 26 నవంబర్ 2026: రూ.28.46 లక్షల సరుకు స్వాధీనం
నిర్మల్ పోలీసుల ‘గంజాయి గస్తీ’తో పట్టుబడ్డ అక్రమ సాగు
రెండున్నర ఎకరాల్లో 258 గంజాయి మొక్కల గుర్తింపు.. నిందితుడి అరెస్ట్
Ganja Seizure | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పత్తి పంట మాటున గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని నిర్మల్ జిల్లా మామడ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో వ్యవసాయ పొలంలో తనిఖీలు నిర్వహించి సుమారు రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తున్న 258 గంజాయి మొక్కలను గుర్తించారు. వీటితో పాటు 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.28.46 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ పోలీసులు చేపట్టిన ‘గంజాయి గస్తీ’లో భాగంగా ఈ అక్రమ సాగును గుర్తించడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 25న మామడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మామడ మండలం తండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్ తండా శివారులో తనిఖీలు నిర్వహించారు. అక్కడి వ్యవసాయ పొలంలో కున్సోత్ రవి (43) పత్తి పంటతో పాటు అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు ధన్జీనాయక్ తండాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారుల సమక్షంలో పంచ సాక్షులను ఏర్పాటు చేసి గంజాయి మొక్కలు, ఎండిన ఆకులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు
ఈ ఆపరేషన్లో పాల్గొన్న డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐలు విజయ్, రాకేష్, మహేందర్, ఏఆర్ సిబ్బంది, మామడ పోలీసు సిబ్బంది, సోన్ సర్కిల్ సిబ్బంది, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఈ బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి సాగుపై సమాచారం ఇవ్వండి
గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ సాగు, విక్రయం, రవాణా, నిల్వ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని నిర్మల్ పోలీసులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి సాగు లేదా మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.