Sathya Velugu, 25 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్’ తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా డంప్‌లు భద్రతా దళాల చేతికి కుప్పలుతెప్పలుగా చిక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల భారీ డంప్‌ను గుర్తించి, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నాయి. భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడేపల్లి అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన స్టీల్ డబ్బాలో దాచిన రూ.39.77 లక్షల నగదును అధికారులు వెలికితీశారు.
అయితే, తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు బడేపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తమ కార్యకలాపాల కోసం రహస్యంగా దాచిపెట్టిన ఈ నగదు డంప్ బయటపడింది. స్వాధీనం చేసుకున్న సొమ్మును బస్తర్‌లోని మావోయిస్టుల వివిధ కార్యకలాపాలు, సరఫరాల కోసం వినియోగించేందుకు నిల్వ చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ డంప్ వెనుక ఏ మావోయిస్టు కమిటీ లేదా ఏ నేతల హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు, రహస్య డంప్‌లపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.