Sathya Velugu, 25 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వినియోగదారులకు విక్రయిస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని, నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) అన్ని రాష్ట్రాల ఆహార భద్రతా విభాగాలను ఆదేశించింది. మార్కెట్లో విక్రయిస్తున్న వివిధ బ్రాండ్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను విస్తృతంగా సేకరించి, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా తనిఖీ చేయాలని FSSAI రాష్ట్రాలకు సూచించింది. వినియోగదారులకు చేరే ప్రతీ నీటి బాటిల్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
కఠిన చట్టపరమైన చర్యలకు ఆదేశం..
ఒవేళ ల్యాబ్ పరీక్షల్లో నీరు సురక్షితం కాదని తేలినా, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో కంపెనీలు విఫలమైనా ఏమాత్రం ఊపేక్షించకూడదని అధికారులు తేల్చిచెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం తక్షణమే చట్టపరమైన చర్యలులతో పాటు అవసరమైతే లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. ఇటీవల బిస్లెరీ బాటిల్ వాటర్ బ్రాండ్ నమూనాల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లుగా ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ కావడంతో FSSAI ఆ సంస్థపై ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్యాకేజ్డ్ వాటర్ తయారీ కేంద్రాలపై నిఘా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను FSSAI హై-రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. దీంతో తయారీ ప్లాంట్లలో ఏటా తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించడంతో పాటు కఠినమైన టెస్టింగ్ నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని రాష్ట్రాలకు ‘FSSAI’ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.