దిశ, వెబ్‌డెస్క్: మండల, మకరవిళక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి సంబంధించిన ఆన్లైన్ వర్చువల్ క్యూ టికెట్లు పూర్తిగా నిండిపోయాయి. 2026–27 మండల-మకరవిళక్కు సీజన్ కోసం నవంబర్ 20 నుండి డిసెంబర్ 25 వరకు, అలాగే డిసెంబర్ 31 తేదీలకు ఆన్లైన్ వర్చువల్ క్యూ స్లాట్లు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. ఆన్లైన్ స్లాట్లు దొరకక నిరాశలో ఉన్న భక్తులకు ఆలయ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను చూపింది. ఆన్లైన్ రిజర్వేషన్ లేని వారు నేరుగా నిర్దేశిత కేంద్రాలకు చేరుకుని స్పాట్ బుకింగ్ పాస్‌లను పొందే సదుపాయాన్ని కల్పించింది. దీని ప్రకారం నిలక్కల్‌లో రోజుకు 10,000 పాస్‌లు, ఎరుమేలిలో 2,000, వండిపెరియార్ సత్రం వద్ద 2,000 పాస్‌ల చొప్పున భక్తులకు జారీ చేస్తున్నారు. అయితే, పంబ వద్ద స్పాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో లేదని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, శబరిమల ప్రసాదం కోసం భక్తులు గంటల తరబడి పొడవైన క్యూలలో వేచి ఉండే ఇబ్బంది లేకుండా కేరళ పోస్టల్ సర్కిల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సన్నిధానంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఇండియా పోస్ట్ కౌంటర్ వద్ద బుక్ చేసుకుంటే, పవిత్రమైన అరవణ, ఉన్నియప్పం ప్రసాదాలను సురక్షితంగా ప్యాక్ చేసి నేరుగా భక్తుల ఇంటి చిరునామాకే పంపించనున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది.
యాత్రా సీజన్లో భాగంగా ఆలయం ప్రతిరోజూ మొత్తం 18 గంటల పాటు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఉదయం 3:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు స్వామివారి దర్శనం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం 3:30 నుండి 11:00 గంటల వరకు నెయ్యాభిషేకం నిర్వహిస్తారు. దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వెంట అసలు ఆధార్ కార్డు లేదా జిరాక్స్‌తో పాటు వర్చువల్ క్యూ పాస్‌ను తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు వర్చువల్ క్యూ పాస్ అవసరం లేదని తెలిపారు. ప్రధాన మార్గమైన నిలక్కల్–పంబతో పాటు ఎరుమేలి అటవీ మార్గం, వండిపెరియార్–సత్రం మార్గాల్లో ప్రయాణించే భక్తులు ఆయా మార్గాలకు సంబంధించిన బుకింగ్ నిబంధనలను ముందే తనిఖీ చేసుకుని యాత్రకు సిద్ధం కావాలని కోరారు.